గుండెలు అవిసిపోయేలా పెద్దగా అరుస్తూ..నినాదాలు చేస్తూ.. నువ్వు చనిపోయినా నాతోనే ఉంటావ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈమె పేరు హిమాన్షీ నర్వాల్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేయటానికి ఓ కారణం ఉంది. ఆ చనిపోయిన అమరవీరుడి పేరు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్. వయస్సు కేవలం 26 సంవత్సరాలు. ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ గా సేవలు అందిస్తున్న వినయ్ నర్వాల్ చిన్ననాటి స్నేహితురాలైన హిమాన్షీ నర్వాల్ తో కేవలం 6 రోజుల క్రితమే పెళ్లి జరిగింది. నాలుగు రోజుల క్రితం రిసెప్షన్ పూర్తైంది. చిన్నతనం నుంచి తను ఎంతో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ పెద్ద యుద్ధమే చేశారట వినయ్ నర్వాల్. నేవీలో అధికారిగా ఉద్యోగం సాధించిన అమ్మాయి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. ఇదంతా జరిగి కేవలం ఆరు రోజుల కాలేదు హనీమూన్ కోసం కశ్మీర్ కు వెళ్లిన వినయ్, హిమాన్షీ పహల్గాం లో తమ జీవితంలో చూడలేని మారణహోమాన్ని చూశారు. ఉగ్రవాదులు ఒక్కసారిగా తెగబడి కాల్పులు జరుపుతుంటే వినయ్ నర్వాల్ ఆ ఉగ్రమూకలను అఢ్డుకునేందుకు ఎదురు వెళ్లారట. హిమాన్షీ వద్దని వారిస్తున్నా ఇది ఇప్పుడు అత్యవసరం అంటూ ఉగ్రవాదుల నుంచి అమాయకులను కాపాడే ప్రయత్నంలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఓ ఉగ్రవాది వినయ్ తలకు తుపాకీ పెట్టి నీ పేరంటని అడిగాడట. చెప్పగానే చంపేశారని ఆ ఉగ్రవాదుల ఆలోచన ఏంటో మీరే ఆలోచించుకోండని ఆమె కన్నీళ్లు పెడుతున్న ఓ వీడియో నిన్ననే వైరల్ అయ్యింది. తన భర్త మృతదేహం పక్కన కూర్చుని ఏం చేయలేని తన అశక్తతను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటో యావత్ దేశాన్ని ప్రశ్నించింది ఈ ఉగ్రవాదాన్ని ఏం చేద్దామని. ఈరోజు భారత నావికా దళం కడసారిగా వినయ్ నర్వాల్ కు వీడ్కోలు పలికింది. భారత నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వినయ్ నర్వాల్ కు కడసారిగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా హిమాన్షీ ఎమోషనల్ అయ్యారు. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు వినయ్ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే సమాధానం చెప్పటం ఆపటం ఎవ్వరి తరం కావట్లేదు.